ఒకరి నుంచి 23 మందికి కరోనా.. 15 గ్రామాలు నిర్బంధం

కరోనా వైరస్‌ పేరు వినగానే అందరూ హడలిపోతున్నారు. ఇల్లు వదిలి బయటకు రావాలి అంటేనే జంకుతున్నారు. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టు.. ఎవరు కరోనా సోకిన వ్యక్తో కూడా తెలియడం లేదు. అంతలా వ్యాపిస్తుంది ఈ కరోనా వైరస్‌.


పంజాబ్‌కు చెందిన గురుద్వార పూజారి(70) కరోనా వైరస్‌తో మార్చి 18న మృతి చెందిన విషయం విదితమే. ఈ పూజారి మరో 23 మందికి కరోనా అంటించినట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చే కంటే ముందే.. ఆయన 15 గ్రామాల్లో తిరిగినట్లు నిర్ధారణ అయింది. 


పూజారితో పాటు ఆయన స్నేహితులిద్దరూ జర్మనీ, ఇటలీ దేశాల్లో పర్యటించి మార్చి 6న అక్కడ్నుంచి నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీ నుంచి పంజాబ్‌కు వచ్చారు. మార్చి 8న ఆనంద్‌పూర్‌ షాహీబ్‌లో ఓ కార్యక్రమానికి ముగ్గురూ హాజరయ్యారు. ఆ తర్వాత తన సొంతూరుకు వచ్చాడు పూజారి. పూజారి ఇంట్లో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన మనవళ్లు, మనవరాళ్లు కూడా బయటి వాళ్లను కలిశారు. ఇలా మొత్తం పూజారి నుంచి 23 మందికి కరోనా సోకింది. మార్చి 8 నుంచి 10వ తేదీ మధ్యలో కనీసం 15 గ్రామాల్లో పర్యటించారు ఈ ముగ్గరు వ్యక్తులు. మొత్తంగా 100 మందిని వీరు కలిసినట్లు సమాచారం. ఈ పదిహేను గ్రామాలను వైద్యాధికారులు, పోలీసులు నిర్బంధించారు. పూజారితో పాటు మరో ఇద్దరు కలిసిన వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.