వాస్తవానికి ఇప్పుడు చార్‌ధామ్ సీజన్ ప్రారంభం కావాలి. ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదారినాథ్, భద్రీనాథ్ ఆలయాలను భక్తుల కోసం తెరిచే సీజన్ ఇదే. కానీ ఈసారి కరోనా వైరస్ వల్ల ఆలయాలను కొంత ఆలస్యం తెరవనున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. మే 14వ తేదీన జ్యోతిర్లింగ క్షేత్రం కేదారినాథ్‌ను ఓపెన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక మే 15వ తేదీన బద్రీనాథ్ టెంపుల్‌ను తెరుస్తామని చెప్పారు.
కేదారినాథ్‌కు చెందిన ప్రధాన పూజారి భీమాశంకర లింగ ప్రస్తుతం మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వస్తున్నారు. ఆయనతో పాటు అయిదుగురు అసిస్టెంట్లు ఉన్నారు. అయితే వీరిని రుద్రప్రయాగలో క్వారెంట్ చేసిన తర్వాతనే .. కేదారినాథ్ ఆలయానికి పంపనున్నారు. ఇక బద్రీనాథ్‌కు చెందిన ప్రధాన పూజారి బీ.శంకరన్ నంబూద్రి కేరళలోని కన్నూర్ నుంచి ఉత్తరాఖండ్‌కు వస్తున్నారు. ఆయన్ను చమోలీలో క్వారెంటైన్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎవరైనా వస్తే, వారిని క్వారెంటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే రెండు ఆలయాల ప్రధాన పూజారులను క్వారెంటైన్ చేయనున్నారు.
నిజానికి ఏప్రిల్ 29 కేదారినాథ్, 30న బద్రీనాథ్ ఆలయాలను తెరవాల్సి ఉంది. కానీ ప్రధాన పూజారులు బయటి రాష్ట్రాల్లో ఉండడం వల్ల.. స్థానికంగా ఉన్న వారి అసిస్టెంట్లకు ఆలయాలు తెరిచే అవకాశం ఇచ్చారు. అయితే సాధారణ భక్తులకు మాత్రం ఆలయాలు తెరిచే తేదీలను కొత్తగా ప్రకటించారు. దాని ప్రకారం మే 14న కేదారినాథ్, 15న బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు.